language
english

బాబుతో చెడుతోందా?: నెట్టేసే నెపం, బాబు వ్యాఖ్యలతో షాక్‌లో అఖిల.. అసలేం జరుగుతోంది..

అమరావతి: అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ.. మంత్రి పదవి కూడా అనూహ్యంగానే చేపట్టారు. పెద్దగా అనుభవం లేని అమ్మాయి ఎమ్మెల్యేగా నిలదొక్కుకుంటుందా?.. అన్న సందేహాలు అలా తెరపై ఉండగానే మంత్రి పదవినీ చేపట్టారు.ఇంతలోనే నంద్యాల ఉపఎన్నికలు రావడంతో.. చాలామంది అఖిలప్రియ సత్తాకు ఇదో పరీక్షగా భావించారు. దానికి తోడు సీనియర్లను కలుపుకుని వెళ్లడం లేదన్న అపవాదు ఒకటి అప్పటికీ వెంటాడుతూ ఉంది. నంద్యాల ఉపఎన్నికలో గెలిచి ఉండకపోతే పార్టీలో ఆమె ప్రాధాన్యం ఎలా ఉండేదో కానీ.. గెలుపు తర్వాత ఆమె ప్రాధాన్యానికి ఢోకా లేదనుకున్నారు.కానీ ఇంతలోనే కృష్ణా నదిలో బోటు బోల్తా రూపంలో అఖిలప్రియకు మరో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏకంగా సొంత పార్టీ నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. కృష్ణానదిలో బోటు విషాదానికి సంబంధించి సంబంధిత శాఖదే పూర్తి బాధ్యత అనే రీతిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే 22 మంది చనిపోయారన్నారు. అంతేకాదు గతంలో శాఖపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామాలు చేసేవారని గుర్తుచేశారు. దుర్ఘటనకు మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇవీ లింకులు: తీగ లాగితే డొంకంతా!.. బోటు విషాదంతో వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అఖిలప్రియ కంగుతినేలా చేశాయి. అధికారుల సమక్షంలో అఖిలప్రియను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. పార్టీలోని పలువురు పెద్దలు కూడా సీఎం వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండటంతో.. అంతా కలిసి ఆమెను రాజీనామా వైపు ఒత్తిడి చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ గండం ఎలా గట్టెక్కాలో తెలియక అఖిలప్రియ కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. కొత్త కోణాలు: బోటులో ఆ అధికారి పెట్టుబడులు.. కొండలరావు కొత్త డ్రామా, అఖిలప్రియపై విమర్శలు.. నిజానికి టూరిజం శాఖ గత మూడేళ్లు సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంది. అఖిలప్రియ ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఈ మూడేళ్లలో కనిపించని అవినీతి అక్రమాలు ఇప్పుడు మాత్రమే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా? అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ మూడేళ్లలో బోట్లపై ఎందుకు పర్యవేక్షణ కరువైంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న బోట్లన్నింటికి బాబు వద్ద ఆ శాఖ ఉన్నప్పుడే అనుమతులు జారీ అయిపోయాయి. ఇప్పుడీ తప్పులన్నింటిని అఖిలప్రియ మీదకు నెట్టేసి.. ఆమె చేత రాజీనామా చేయించాలనే ప్రయత్నాలు జోరందుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. పరిస్థితులు చూస్తుంటే.. భూమా వర్గానికి, చంద్రబాబుతో చెడుతున్నట్టుగానే కనిపిస్తోంది. పార్టీలోకి వచ్చిన తొలినాళ్లలో దక్కిన ఆదరణ అంతకంతకూ దూరమవుతున్నట్టుగా వారు భావిస్తున్నారు. ఇటీవలి పరిణామాలు వారిని బాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. బోటు ప్రమాద విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి మరక పడకుండా ఉండేందుకు.. ఆఖరికి అధికారులపై వచ్చిన ఆరోపణలను సైతం అఖిలప్రియ తోసిపుచ్చారు. తీరా వేళ్లన్ని ఆమె వైపే చూపించేసరికి అఖిల షాక్ తిన్నారు. ఆమెను ఒత్తిడిలోకి నెట్టి తనకు తానుగా పదవి నుంచి తప్పించే వ్యూహాన్ని టీడీపీ అంతర్గతంగా అమలు చేస్తోందా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. చూడాలి మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో!..

Comments

comments

Movie News
Telugu News