language
english

మామూలోడు కాదు: మంత్రినే ఇలా!, పద్మారావు పీఆర్వో పీలి కృష్ణ అరాచకాలు..

నిర్మల్: ఆయనో మంత్రి గారికి పీఆర్వో. కానీ ఆయనే మంత్రి అనుకునేంతలా చలామణి అవుతాడు. ఎంతటి వారైనా సరే తనకు అడ్డు వస్తే వాళ్లను బజారుకీడ్చాలని చూస్తాడు.జర్నలిస్టు కావడంతో.. అవసరమైతే సదరు వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాయించేందుకు కూడా వెనుకాడడు. దీంతో రోజురోజుకు నిర్మల్ జిల్లాలో అతని బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే.. ఆఖరికి మంత్రి జోగు రామన్నను సైతం అతను లెక్క చేయలేనంత వరకు వెళ్లింది. తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు గౌడ్ పీఆర్వో పీలి కృష్ణ ఆగడాలివి. మంత్రి పేరును అడ్డుపెట్టుకుని మహిళలతో అసభ్యంగా వ్యవహరించడం.. తన సొంత జిల్లా నిర్మల్ లో అరాచాకాలకు పాల్పడటం పీలి కృష్ణకు పరిపాటిగా మారిపోయింది. ధైర్యం చేసి ఎవరైనా కేసు పెట్టినా.. పై స్థాయి నుంచి పైరవీలు చేయించగలడు. తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టించి.. దినపత్రికలలో వారి గురించి తప్పుగా రాయించగల ఘనుడు. మంత్రి జోగు రామన్నకే చెమటలు పట్టించానని ఈమధ్య పీలి కృష్ణ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నాడట. మంత్రులను సైతం వణికించేయగలనని చెప్పుకుని జిల్లాలో గొప్పలు పోతున్నాడు. ఇంతకీ పీలి కృష్ణ వ్యవహారంలో జోగు రామన్న ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే.. నిర్మల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శితో తలెత్తిన వివాదమే ఇందుకు ప్రధాన కారణం. నిర్మల్ జిల్లా కడెం మండలం ముసాయిపేట గ్రామం పీలి కృష్ణ స్వగ్రామం. కడెం మాజీ ఎంపీపీ, టీఆర్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొలుగూరి రాజేశ్వర్ గౌడ్ పై ఇటీవల పీలి కృష్ణ దాడికి దిగాడు. అతని ఇంటిపై దాడి చేసి పలు వస్తువులను దహనం చేశాడు. ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశాడు. పీలి కృష్ణ దాడిపై రాజేశ్వర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుటుంబ సభ్యులను చితకబాదారని అందులో పేర్కొన్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా.. పీలి కృష్ణకే సహకరించారు. రాజేశ్వర్ గౌడే తనపై దాడి చేశారని పీలి కృష్ణ చేసిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి పీలి కృష్ణ సెక్షన్ 307, 324 కింద కేసు పెట్టించాడు. ఇదంతా ఇలా ఉంటే.. ఇటీవల వెలుగుచూసిన పీలి కృష్ణ ఆడియో-వీడియో క్లిప్పింగ్స్ కొన్ని అతని నిజస్వరూపాన్ని బయటపెట్టాయి. ఉద్దేశపూర్వకంగానే రాజేశ్వర్ ఇంటిపై దాడి చేశానని, తిరగి తానే అతనిపై కేసు పెట్టానని మిత్రులతో చెప్పడం ఆ వీడియోల్లో బహిర్గతమైనట్టు తెలుస్తోంది. పీలి కృష్ణ అరాచకాలతో విసిగిపోయిన రాజేశ్వర్ గౌడ్ దీనిపై మంత్రి పద్మారావుకు, సీఎంలకు ఫిర్యాదు చేశారు. మంత్రి జోగు రామన్నను కూడా ఆశ్రయించడంతో ఆయన జోక్యం చేసుకున్నారు. మంత్రి జోగు రామన్న స్వయంగా పీలి కృష్ణకు ఫోన్ చేసి వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పీలి కృష్ణ మాత్రం మంత్రినే బనాయించే ప్రయత్నం చేశాడు. మీపై గౌరవం ఉందని చెబుతూనే.. అసలిది మీ జిల్లా కానే కాదని, అలాంటప్పుడు మీ జోక్యం ఏంటని ప్రశ్నించాడు. అన్నా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అతను నా తమ్ముడిని కొట్టాడు. వాడిపై కేసు పెట్టకుంటే నేను బతికుండి వేస్ట్ . మీరొక మంత్రిగా ఉండి అతనికి సపోర్టు చేయడమేమిటి? అది మీ ఏరియా కాదు. మీ నియోజకవర్గం కాదు. నేను హోంమినిస్టర్ తో మాట్లాడి కేసు పెట్టించిన. నేనొక జర్నలిస్టును. అవసరమైతే వార్తలు రాపిస్తా. లేదంటే కోర్టుకు పోతా అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా అవసరమైతే మంత్రి జోగు రామన్న తనను బూతులు తిట్టాడని ఆడియో క్లిప్పులు బయటపెడుతానని రివర్స్ లో మంత్రినే బెదిరించాడు పీలి కృష్ణ. అంతేకాదు నిర్మల్ జిల్లాలో జోగు రామన్న జోక్యం చేసుకుంటున్నారని జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చెప్పి.. ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తోంది. పీలి కృష్ణ ఆడియో, వీడియో టేపులన్ని ప్రస్తుతం పలు మీడియా సంస్థల చేతిలో ఉన్నాయి. అవి బయటకొస్తే పీఆర్వో అరాచాకాలు మరిన్ని బయటపడే అవకాశం ఉంది. మంత్రి పద్మారావు సహాయం కోసం వచ్చే పలువురు మహిళల పట్ల కూడా పీఆర్వో పీలి కృష్ణ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. వాటికి సంబంధించిన ఆడియో టేపులు కూడా పలు మీడియా ఛానెళ్లకు చిక్కినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒక మంత్రి పీఆర్వో మరో మంత్రిని బెదిరించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Comments

comments

Movie News
Telugu News